నిజామాబాద్
అమరవీరుల ఆశయాన్ని కొనసాగిద్దాం. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు ప్రభాకర్ పిలుపు


జనం వెలుగు, కమ్మర్పల్లి:- సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా కమ్మర్పల్లి సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ కామ్రేడ్ ఎస్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ప్రజాపంతా నాయకులు వి. ప్రభాకర్, B. దేవారంలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా, దళారీ పెట్టుబడి దారి విధానానికివ్యతిరేకంగా, భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా పేద ప్రజలుఅనేక పోరాటాలు చేసే క్రమంలో ఆ పోరాటానికి నాయకత్వం వహించిన అనేకమంది కమ్యూనిస్టు విప్లవ కారుల్ని రాజ్యం బూటక పు ఎన్కౌంటర్లో కాల్చివేసింది. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను, 4000 గ్రామాల విముక్తి చేసి పంచి ఇచ్చిన పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది సభ. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పాలకులంతా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడమే తప్ప పేదలకు వరగబెట్టిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు బిజెపి డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తామని ,వంటగ్యాస్ ధర తగ్గిస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారులకు వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అమలు చేయించుకోవడానికి పోరాటమే మార్గమని అమరవీరులు చూపిన బాటనే అని నొక్కి చెప్పారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంటుతో అధికారులకు వచ్చిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానీకానికి చేసిందేమీ లేదని నాలుగైదు దశాబ్దల కాలంగా పోడు రైతుల సమస్య పరిష్కారం చేయాలని పోరాటం జరుగుతుంటే కుర్చీ వేసుకుని సమస్యను పరిష్కరిస్తానని ప్రగల్ బాలుపలికి సాగు చేసుకున్న గిరిజన గిరిజన ఇతరులను భూమి నుండి పోలీసు బలగాలతో తనివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొక ఉద్యోగం ఎగనాం పెట్టాడని, మద్యంద్వారా 32 వేల కోట్ల ఆదాయం సమకూర్చడమే ప్రధాన ధ్యేయంగా మారిందని ఎద్దేవా చేశారు. మరోవైపు పౌర హక్కుల నేతగా మార్తానని కోతలు కోసిన కేసిఆర్ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాచి వేయడమే కాకుండా అర్బన్ నక్సలైట్లను ముద్ర వేసి హక్కులను బొంద పెడుతున్న సంగతి మరవరాదని అన్నారు. ఈ ప్రాంతంలో కొత్త బిచ్చగాళ్లు తయారైనట్లుగా కొన్ని ఎర్రజెండా పార్టీలు పేరు చెప్పుకొని బీడీ కార్మికులను పైరవీల పేరుతో మోసం చేస్తున్న వారి పట్ల జాగ్రత్త వహించాలని కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు . ఈ ప్రాంతంలో పనిచేసిన కామ్రేడ్ కుమార్ నారాయణ. విద్యార్థి ఉద్యమాల ప్రతముడు j.c.s.ప్రసాద్. విప్లవ పార్టీ. కార్యదర్శి కామ్రేడ్ రాంనర్సయ్య. మాజీ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యలను అత్యవసర పరిస్థితి కాలంలో బూటక ఎన్కౌంటర్ లో కాల్చివేశారు. అంతేకాక ఇల్లందు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఐదుగురు కామ్రేడ్స్ బూటక ఎన్కౌంటర్లో కాల్చివేసిన రాజ్యం స్వభావం ఇంకా మారలేదని అన్నారు. మన హక్కుల సాధన కొరకు, రక్షణ కొరకు పోరాటమే మార్గమని నొక్కి చెప్పారు కష్టజీవుల రాజ్యం నిర్మాణానికై ఉద్యమమే, అమరవీరులు చేసిన త్యాగం మార్గమే మన మార్గమని, నిజమైన నివాళి అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపడతామని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో, జి కిషన్, జి సత్యనారాయణ గౌడ్, వి బాలయ్య, అశోక్, కే రాజేశ్వర్, వి ఆనంద్, గ్రామపంచాయతీ లక్ష్మణ్, లక్ష్మక్క, జమున, గంగక్క, భాజక్క లతోపాటు వందలాదిమందిపాల్గొన్నారు.
నిజామాబాద్
అదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ


అదనపు కలెక్టర్ తో మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల భేటీ
జనంవెలుగు నిజామాబాద్ : – నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజాగౌడ్ తో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో భేటీ అయ్యారు.
జిల్లా డీఎంఏసీ సభ్యులను అదనపు కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీ. ఓకు అనుగుణంగా అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
ఈ విషయంలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజనీర్ ఉమేష్ చంద్ర,
డీఎంఏసీ సభ్యులు కోయల్ కర్ రామ్ దయానంద్, ఆర్.భూపతి, జి.సాయి ప్రసాద్, ఎంఏ. మాజిద్, ఎల్.బాల్ కుమార్, ఎస్.శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిజామాబాద్
ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి


ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి
ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఖరీఫ్ పంటను గట్టెక్కిస్తాం…రబీలో మాత్రం వరి వేస్తే కాపాడలేం
ఆరుతడి సాగుకు అన్నివిధాలుగా తోడ్పాటును అందిస్తాం
కొత్తగా బోరుబావులు తవ్విస్తే సీజ్ చేస్తామని స్పష్టీకరణ
జనంవెలుగు నిజామాబాద్ :- ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు రబీలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఒకవేళ వరి మినహా ఇతర పంటల సాగుకు చౌడు భూములు వంటి నేల రకాలు సహకరించకపోతే క్రాప్ హాలిడే పాటించాలని, వరి సాగు మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు.
నందిపేట మండలం నూత్ పల్లి రైతు వేదికలో మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులనుద్దేశించి మాట్లాడారు.
ఖరీఫ్ లో వేసిన వరి పంట పూర్తి స్థాయిలో చేతికి అందేంత వరకు జిల్లా యంత్రాంగం తరపున కాపాడుతామని రైతులకు భరోసా కల్పించారు.
అయితే రబీలో మాత్రం వరి పంటకు సాగు నీరు అందించే పరిస్థితి ఉండదని కలెక్టర్ వెల్లడించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో ప్రతీకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైతులకు కీలక సూచనలు చేశారు.
వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పెసలు, మినుములు, శనగతో పాటు జొన్న, మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటల సాగును చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని రైతులను ప్రోత్సహించారు.
బిందు సేద్యాన్ని వినియోగించుకొని ఆయిల్‌పామ్ తోటలు, కూరగాయలు తదితర పంటలను సాగు చేయడం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని అన్నారు. ఆరుతడి పంటల సాగుకు ముందుకు వచ్చే రైతాంగానికి ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరఫున తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు.
మల్చింగ్, బిందు సేద్యం విధానాలకు రాయితీ వర్తించేలా ప్రణాలికలు రూపొందిస్తామని అన్నారు. కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా కూడా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
వీబీజీరాంజీ కింద ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోరు బావుల రీఛార్జ్ వంటి పనులను చేపట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవడంపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొత్తగా బోరుబావులు తవ్వకూడదని, ఎవరైనా తవ్విస్తే వాటిని సీజ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని, రానున్న రోజుల్లో సేద్యానికి కరెంటు సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, యాసంగిలో వరి సాగు చేసి ఇబ్బందుల్లో పడవద్దని జిల్లా పాలనాధికారి హితవు పలికారు.
ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు సైతం రబీలో రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆదర్శ రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రబీలో ఏ తరహా పంటలు సాగు చేయవచ్చు, కరువు పరిస్థితులను అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటీ తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు రైతులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్య, సర్పంచ్ రాజిరెడ్డి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి


ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశం
జనంవెలుగు నిజామాబాద్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, మున్సిపల్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్లతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, పెండింగ్ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడం, కొంతమంది ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు అయి ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు అవగాహన సదస్సులలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








