నిజామాబాద్
శ్రీరాంసాగర్ ఆయకట్టుకు, “ఖరీఫ్”లో డోకా లేదు.


శ్రీరాంసాగర్ ఆయకట్టుకు,
“ఖరీఫ్”లో డోకా లేదు.
ఖరీఫ్ లో సుమారు 5 లక్షల ఎకరా లకు నెరవేరనున్న సాగునీటి లక్ష్యం
సుమారు 65 టిఎంసిల నీటి అవసరం
రిజర్వాయర్ లో 60 టిఎంసిల చేరిన నీటి నిలువ
జనం వెలుగు, బాల్కొండ:- ఉత్తర తెలంగాణాలో రైతుల పాలిట కల్పతరువై వెలసిన శ్రీరాంసాగరానికి ఖరీఫ్ సీజన్ కు డోకా లేదని చెప్పక తప్పదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల ద్వారా ఖరీఫ్ లో మొట్ట మొదటి సారిగా ఆగష్టు 7 న ఆయకట్టుకు అధికారులు సాగు నీటిని విడుదల చేసినది పాఠకులకు విదితమే. గోదావరి పరివాహకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి గత జూన్ 1 వ తేదీ నుండి, ఆగష్టు 31 వరకు సుమారు 60 టిఎంసిల నీరు రిజర్వాయర్ లోకి వచ్చి చేరింది. గత 2 మాసాలుగా వాతావ రణంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం వల్ల అడపాదడపా కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఆశించినంత మేరకు గోదావరి నది పరివాహకం ద్వారా వరదలు వచ్చి చేరడంతో రిజర్వాయర్ లో మెల్లి మెల్లిగా నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించా లనే లక్ష్యం కాగా, దానికి సుమారు 65 టిఎంసిల నీటి అవసరం ఉంటుందని అధికారుల అంచనా. ఈ పాటికే రిజర్వాయర్ లోకి సుమారు 60 టిఎంసిల నీరు వచ్చి చేరగా, గత జూన్ నుండి ఆగష్టు 31వ తేది వరకు సుమారు 12 టిఎంసిల నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగు నీటిని అధికారులు విడుదల చేయడం జరిగింది. ఈ నెల 31 వ తేదీన గోదావరి నది పరివాహకం ద్వారా సుమారు 9 వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీరాంసాగర్ జలాశయంలోకి వచ్చి చేరుతుండగా 108 5 అడుగులకు 60 టిఎంసిలకు నీరు చేరింది. శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు 85 నుండి 90 టిఎంసిలకు నీరు నిలువ ఉంటుంది. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్ లో 5 లక్షల ఎకరాలకు ఆయకట్టు రైతాంగానికి సుమా రు 65 టి ఎంసిల నీరు అవసరం ఉంటుండగా, గత రెండు మాసాలుగా ఆయకట్టు రైతాంగానికి సుమారు 12 టిఎంసిల నీటిని అధికారులు విడుదల చేయడం జరిగింది. కాకతీయ కాలువ జోన్ 1,జోన్ 2 సుమా రు 5 లక్షల ఎకరాలకు, నిర్మల్ జిల్లాకు నీరందించే సరస్వతి కాలువ ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. సరస్వతి కాలువ ద్వారా సుమారు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా 36 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు నీరందించే లక్ష్మి కాలువ ద్వారా ఆయకట్టు రైతాంగానికి లక్ష్మికాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతొంది. లక్ష్మి కాలువ ద్వారా 32 వేల ఎకరాలకు సాగు నీరు అందివ్వనున్నారు. శ్రీరాంసాగర్ జలాలు లక్ష్యం చేరడంతో ఆయకట్టు రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తొంది.
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.
నిజామాబాద్
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే,
డీఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు.
చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారికి జ్ఞాపికలు బహూకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్.టీ.సీ సంస్థలకు బహుమతులు దక్కాయి. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.








