Connect with us

నిజామాబాద్

ప్రమాద రహిత జిల్లాగా నిలుపుదాం

janamvelugunews

Published

on

ప్రమాద రహిత జిల్లాగా నిలుపుదాం

అవగాహన సదస్సులో జిల్లా జడ్జి, కలెక్టర్, సీ.పీ పిలుపు

హెల్మెట్ ధారణను అలవాటుగా మలుచుకోవాలని హితవు

జనంవెలుగు, నిజామాబాద్, ఆగస్టు 28 : నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ, న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుండి కోర్టు కాంప్లెక్ చౌరస్తా వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సీ.పీలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కలిపించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్థులుగా పరిగణించబడతారని, చట్ట ప్రకారం మూడేళ్ళ వరకు కారాగార శిక్ష, రూ. 25 వేల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదని, లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జి హితవు పలికారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్నచిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చవద్దని విద్యార్థులకు హితవు పలికారు.


  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, రోడ్డు దుర్ఘటనలలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90 శాతం వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు. ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ముఖ్యంగా అనేకమంది విద్యార్థులు, యువత సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, ఈ వైఖరిని విడనాడి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, తమ కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి, బంధువులకు కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఎంత చేసినా వారికి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నిజామాబాద్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.


పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్రవాహనదారులు సంఖ్యనే అధికంగా ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరు ప్రమాదాల తీవ్రతను గుర్తించి వాటి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. వాహనాల సంఖ్య పరంగా చూసినా టూవీలర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం వాహనాల సంఖ్య 447923 కాగా, అందులో ద్విచక్ర వాహనాలు 370789 ఉన్నాయని అన్నారు. అత్యధిక మంది హెల్మెట్ ధరించకుండా టూవీలర్స్ నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిలో 55 శాతానికి పైగా యువతనే బాధితులుగా ఉంటున్నారని సీ.పీ ఆవేదన వెలిబుచ్చారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం బారి నుండి తమనుతాము కాపాడుకోవచ్చని హితవు పలికారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామని, అయితే ఎవరికివారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని పిల్లలకు విద్యార్ధి దశ నుండే అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు, గురువులను కోరారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం అనర్ధదాయకమని జాగ్రత్తలు సూచించారు. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే, తల్లిదండ్రులు పడే మానసిక క్షోభ వర్ణనాతీతమని, తీవ్ర గాయాలపాలై అచేతనావస్థకు చేరితే ఇతరులపై ఆధారపడి జీవితం గడపాల్సి రావడం ఎంతో దుర్భరంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గా, టి.శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం.శ్రీకాంత్ బాబు, పి.పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ ఉపాధ్యాయ్, పి.శ్రీనివాస్ రావు, మేజిస్ట్రేట్లు వి.హరికుమార్, చైతన్య, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, ట్రాఫిక్ ఏ.సీ.పీ నారాయణ, ఎంవిఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

janamvelugunews

Published

on

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు

నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే,

డీఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు.

చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారికి జ్ఞాపికలు బహూకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్.టీ.సీ సంస్థలకు బహుమతులు దక్కాయి. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.

Continue Reading