నిజామాబాద్
ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష


ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 04: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. నగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ ఏర్పాట్ల గురించి కమిషనర్ దిలీప్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపధ్యంలో బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ గురించి ఆరా తీశారు. గోప్యతను పాటిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ జరిపించాలని, పోలీసు భద్రత మధ్యన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిన మీదట వివరాలు ఎక్కడ కూడా బయటకు వెల్లడి కాకుండా చూడాలని, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ముద్రణ అనంతరం సాఫ్ట్ కాపీలను పూర్తిస్థాయిలో హార్డ్ డిస్క్ నుండి కూడా తొలగించేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎన్నికల సంఘం క్రిమినల్ చర్యలు చేపడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాలెట్ పత్రాల ముద్రణ విషయంలో ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలని అన్నారు. కాగా, పోలింగ్ కేంద్రాలలో కనీస సదుపాయాలను మరోమారు క్షేత్రస్థాయిలో సరిచూసుకోవాలని సూచించారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు అదనంగా పోలింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ ముగిసిన వెంటనే గట్టి బందోబస్తు మధ్యన బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్ కు తరలించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
నిజామాబాద్
ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు


అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు
భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రతిమల నిమజ్జనం
భక్తుల నృత్యాలతో మార్మోగిన గ్రామం


జనం వెలుగు చౌటకూర్:- దుర్గమ్మ నామస్మరణతో పల్లెలు మార్మోగాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు, బుధవారం హారతులు,కాషాయ జెండాల రెపరెపల మధ్య అమ్మవారి శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తుల పూజలందుకున్న జగన్మాతకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల్ సరఫ్ పల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.
ఈ నెల 11న ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు భక్తిపారవశ్యంతో కొలిచారు. కుంకుమార్చనలు, ప్రత్యేక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.
మంగళ వారం వరకు వైభవంగా కొనసాగిన ఉత్సవాల అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు నిర్వహించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరలను పలు మండపాల నిర్వాహకులు వేలం వేశారు. బుధవారం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.
దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భవానీ భక్తులు, యువకులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలతో సాగిన ఊరేగింపులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పలు దేవీ మండళ్ల నిర్వాహకులు శోభాయాత్రల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఏటేటా గ్రామాల్లో దేవీ మండపాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వినూత్న అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నవరాత్రి వేడుకలు మరింత వైభవంగా సాగుతున్నాయి. గ్రామస్తులు, యువజన సంఘాలు, ఉత్సవ కమిటీల సమన్వయంతో నిర్వహించిన శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. చివరగా అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేయడంతో గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంచద్రారెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసింహ, మీనాక్షి గోవర్ధన్, నాగులు గౌడ్, సాయి కృష్ణ, మల్లేశం, కమల, నాగమ్మ, హేమలత, తదితరులు పాల్గొన్నారు








