నిజామాబాద్
మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి


మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి పిలుపు
కలెక్టర్ చొరవతో గృహ హింస నిరోధక చట్టంపై మిషన్ అపరాజిత పేరుతో అవగాహన సదస్సు
నిజామాబాద్, మే 02: మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు. అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ గౌరవానికి భంగం వాటిల్లనివ్వకుండా, హక్కులను కాపాడుకోగల్గుతారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అనేక మంది మహిళలు గృహ హింసకు సంబంధించిన అంశాలపై అర్జీలు అందించడాన్ని దృష్టిలో పెట్టుకుని, గృహ హింసకు వ్యతిరేకంగా
మహిళల్లో చైతన్యం పెంచేలా జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి చొరవతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మిషన్ అపరాజిత’ పేరుతో గృహ హింస నిరోధక చట్టంపై శనివారం సాయంత్రం కలెక్టరేట్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించబడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే అంగన్వాడి కార్యకర్తలను, మహిళా సర్పంచ్ లను ఆహ్వానించారు.
జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సెషన్స్ జడ్జి శ్రీదేవి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొని గృహ హింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. గృహహింసకు గురైన బాధిత మహిళల ఇబ్బందులను తెలుసుకుని, వారికి తగిన సహకారం లభించేలా చూస్తామని సాంత్వన కల్పించారు. ఓ బాధితురాలికి అదార్ కార్డు లేకపోవడం వల్ల గృహ హింస కేసు విషయంలో తగిన న్యాయం పొందడం లేదని తెలుపడంతో, కలెక్టర్ అప్పటికప్పుడే స్పందించి తన సమక్షంలోనే ఆన్లైన్ లో దరఖాస్తు చేయించడం విశేషం.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి మాట్లాడుతూ, గృహ హింస నిరోధక చట్టం ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్న హక్కులు, రక్షణ చర్యలు, చట్టపరమైన సహాయం గురించి వివరించారు.
కుటుంబంలో జరిగే మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులు కూడా గృహ హింస కిందికే వస్తాయని, ఇలాంటి సందర్భాల్లో మహిళలు భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం (One Stop Centre) సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సఖీ కేంద్రాల ద్వారా అత్యవసర సహాయం, ఉచితంగా న్యాయ సహాయం, వైద్య సేవలు వంటివి ఒకే చోట అందుబాటులో ఉంటాయని వివరించారు.
ప్రతీకూల పరిస్థితులు ఎదురైన సమయాలలో మహిళలు నిర్వేదానికి లోనవకుండా స్వేచ్చగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని, సఖీ సెంటర్ ను సంప్రదించాలని, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, మహిళల హక్కులకు అది ఆటంకంగా మారితే న్యాయం కోసం జిల్లా న్యాయ సేవాదికార సంస్థను కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
మహిళలు స్వతహాగా ఎంతో ఆత్మస్థైర్యం కలిగి ఉంటారని, మీ శక్తి యుక్తులను తెలుసుకుని అన్యాయాలను ధైర్యంగా ఎదురించాలని పిలుపునిచ్చారు. చిన్న నాటి నుండే ఆడపిల్లలను ధైర్యం నూరిపోస్తూ పెంచాలని, వారి గౌరవానికి భంగం కలిగినా, ఎక్కడైనా అన్యాయం ఎదురైనా తిరగబడాలని నేర్పాలన్నారు. మహిళల హక్కుల పరిరక్షణకు పకడ్బందీ చట్టాలు ఉన్నాయనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మహిళల రక్షణకు కట్టుబడి పని చేస్తున్నామని అన్నారు. ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకుని, అవసరమైనప్పుడు సఖీ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలే మహిళలకు శత్రువు అనే నానుడిని రూపుమాపే విధంగా ప్రతి మహిళా ఆపదలో ఉన్న సాటి మహిళను ఆదుకునేందుకు తన శాయశక్తుల కృషి చేయాలని హితవు పలికారు. గృహహింసకు గురైన బాధిత మహిళలకు జిల్లా యంత్రాంగం తరపున అవరసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆర్మూర్ సెషన్స్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన పెరిగితేనే గృహ హింస ఘటనలు తగ్గుతాయని తెలిపారు.
బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడకూడదని, న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గృహ హింస నిరోధక చట్టం, పోక్సొ చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ పద్మ, జీ.జీ.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్, పొలీస్ ఇన్స్పెక్టర్ శ్రీలత, సీ.డీ.పీ.ఓలు, ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








