నిజామాబాద్
భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదే


భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదే
విద్యా విజయోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ వెల్లడి
నిజామాబాద్, మే 17: చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన
సమావేశ మందిరంలో విద్యా విజయోత్సవ దినం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారోత్సవాలలో భాగంగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను, జిల్లా విద్యాశాఖ సాధించిన ప్రగతి గురించి డీ.ఈ.ఓ అశోక్ ముందుగా నివేదిక రూపంలో తెలియజేశారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, భావి భారత పౌరులైన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత గురువులదేనని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. 2047 వరకు భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని సాకారం చేసేవిధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన
పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ఏ లక్ష్య సాధనకైనా చదువు ఎంతో తోడ్పాటును అందిస్తుందని, విద్యతో కూడి ఉన్న జీవితం ఉన్నతంగా ఉంటుందని అన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రైవేట్, కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయని,
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. అయితే విద్యార్థులు కేవలం మార్కుల సాధనకే పరిమితం కాకుండా, నాణ్యమైన విద్యను ఆర్జించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో మెలుగుతూ, నైతిక విలువలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగల్గుతామని ఉద్బోధించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్తులో స్థిరపడేందుకు పదవ తరగతి తరువాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకం అయినందున, మీకు ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సులలో చేరాలని, ఈ విషయంలో ఎవరు ఏం అనుకుంటారో అనే సంశయాలు, మొహమాటానికి లోను కాకూడదని విద్యార్థులకు సూచించారు.
ఎంచుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలని, ఆ దిశగా అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోగల్గుతారని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మల్చుకోవాలని, ఇది పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు.
బలహీనతలను అధిగమిస్తూ, స్పష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుందని విద్యార్థులకు మార్గోపదేశం చేశారు. ఉపాధ్యాయులు అంటే తనకు ఎంతో గౌరవం అని వెల్లడించిన కలెక్టర్, విద్యార్థులు భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా తమ గురుతర బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. అప్పుడే గురువు అనే స్థానానికి మరింత గౌరవం, వన్నె లభిస్తూ సార్ధకత చేకూరుతుందని అన్నారు. తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్షను చూపకుండా వారిని ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలలో రాణించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ, మెరుగైన విద్యా బోధనకై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ బడులలో సీ.ఎం బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) పథకాన్ని అమలు చేయనుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ, విద్యారంగ ప్రాధాన్యతను గుర్తెరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి సదుపాయాలను కల్పిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను నెలకొల్పుతోందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారికి నాణ్యమైన విద్యను బోధించాలని, వారి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాలు, బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహూకరించారు. బాల సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో బీ.సీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, జీఈసీఓ భాగ్యలక్ష్మి, ఎం.ఈ.ఓలు, హెచ్.ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
నిజామాబాద్
ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు


అంబరాన్నంటిన దుర్గమ్మ శోభాయాత్రలు
భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రతిమల నిమజ్జనం
భక్తుల నృత్యాలతో మార్మోగిన గ్రామం


జనం వెలుగు చౌటకూర్:- దుర్గమ్మ నామస్మరణతో పల్లెలు మార్మోగాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు, బుధవారం హారతులు,కాషాయ జెండాల రెపరెపల మధ్య అమ్మవారి శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగాయి. తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తుల పూజలందుకున్న జగన్మాతకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల్ సరఫ్ పల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.
ఈ నెల 11న ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు భక్తిపారవశ్యంతో కొలిచారు. కుంకుమార్చనలు, ప్రత్యేక హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు.
మంగళ వారం వరకు వైభవంగా కొనసాగిన ఉత్సవాల అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు నిర్వహించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరలను పలు మండపాల నిర్వాహకులు వేలం వేశారు. బుధవారం నిర్వహించిన శోభాయాత్రల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.
దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భవానీ భక్తులు, యువకులు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలతో సాగిన ఊరేగింపులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పలు దేవీ మండళ్ల నిర్వాహకులు శోభాయాత్రల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఏటేటా గ్రామాల్లో దేవీ మండపాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వినూత్న అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నవరాత్రి వేడుకలు మరింత వైభవంగా సాగుతున్నాయి. గ్రామస్తులు, యువజన సంఘాలు, ఉత్సవ కమిటీల సమన్వయంతో నిర్వహించిన శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. చివరగా అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేయడంతో గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంచద్రారెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసింహ, మీనాక్షి గోవర్ధన్, నాగులు గౌడ్, సాయి కృష్ణ, మల్లేశం, కమల, నాగమ్మ, హేమలత, తదితరులు పాల్గొన్నారు








