నిజామాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి


భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
నిజామాబాద్ జూలై 30 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి డి.జి.పి. సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్ష పరిస్థితులు, చేపట్టవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లా స్థాయిలో 24×7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మోహరించి పూర్తి అప్రమత్తంగా ఉంచామని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కూలిపోయే ప్రమాదం ఉన్న పాత భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, వాగులు,
చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని తెలిపారు. పోలీసు శాఖతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచిస్తూ, “జీరో క్యాజువాలిటీస్” లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
డీ.జీ.పీ సీ.వీ.ఆనంద్ మాట్లాడుతూ, జిల్లా పోలీసు అధికారులు తప్పనిసరిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను అనుసరించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించామని, అవసరమైన చోట ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా స్థాయిలో పోలీసు శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పని చేసి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్ఓ గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








