నిజామాబాద్
ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి


ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి
జయంతి వేడుకలో కలెక్టర్ భవేష్ మిశ్రా
జనంవెలుగు, నిజామాబాద్, ఆగస్టు 06 : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. 1969 ఉద్యమంతో పాటు మలి విడత ఉద్యమం లోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఆశ, శ్వాసగా ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా అలుపెరుగని కృషి చేస్తూ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారని అన్నారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కాగా, అంతకుముందు కంటేశ్వర్ చౌరస్తాలో గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ వి.భుజంగరావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను శ్లాఘిస్తూ, జయంతి వేడుకలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్ఓ గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారిణి రజిత, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








