Education
అల్ఫోర్స్ విద్యార్థులను అభినందించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి


అల్ఫోర్స్ విద్యార్థులను అభినందించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
జనంవెలుగు, నిర్మల్ బ్యూరో:- నాణ్యమైన విద్య ద్వారా విజయాలను నమోదు చేయడమే ఉజ్వల భవిష్యత్తుకు పునాదని జాదవ్ పరాశురాం డీఐఈఓ కార్యాలయంలో అత్యుత్తమ మార్కులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను అభినందించిన సందర్బంగా మాట్లాడారు. చక్కటి ప్రణాళికతో విజయాలను చాలా సులువుగా సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు కృషి చేసి ఘన విజయం సాధించాలని సూచించారు. ఇటీవల కాలంలో ప్రకటింపబడిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు – ఎంపీసీ ద్వితీయ సంవత్సరములో మరియా మహావీన్ 991 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఎం. సాధన 989 మార్కులు, మరియు ఎంపీసీ మొదటి సంవత్సరంలో డి. సాహితి 467 మార్కులు, బీ. రుతిక 467 మార్కులు, ఎస్. హిమ బిందు 467 మార్కులు, ఎన్ శ్రీ భావన 466 మార్కులు, సిహెచ్ సంపద 466 మార్కులు, జే. నవ్య శ్రీ 466 మార్కులు బైపిసి మొదటి సంవత్సరంలో ఎస్. కవాల్ ప్రీత్ కౌర్ 437 మార్కులు, ఎం. ప్రీతి 437 మార్కులను సాధించి నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించారని చెప్పారు. ఘన విజయాల పరంపరను కొనసాగింప చేస్తున్న అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు పూల మొక్కలను అందజేసి మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.
Crime
రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి


రెండో తరగతి విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి ఉపాద్యాయుడి దాడి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద, మండల వైద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఇఓను చారవాణిలో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని ఈ రోజు వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమని చెప్పినట్లు వివరించారు.








