నిజామాబాద్
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తనిఖీ


సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తనిఖీ
మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
జనంవెలుగు, నిజామాబాద్, ఆగస్టు 27 : ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టంగా కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ విభాగాలను, ఫీవర్ వార్డు, ఆపరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స వార్డు, రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, ఎలిసా టెస్ట్ సెంటర్, టీ.హబ్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. ప్రతిరోజూ సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో ఎంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ను అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు సరిపడా మందులు, ప్లాస్మా, ప్లేట్ లెట్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫీవర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్యాసదుపాయల గురించి వాకబు చేశారు. బ్లడ్ సాంపిల్స్ సేకరించి, వాటిని పరీక్షించిన అనంతరం రోగులకు అందిస్తున్న రిపోర్టులు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆన్ లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఓ.పీ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై వారికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి రక్త నమూనాల సేకరణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా, మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పేరుకుని జీజీహెచ్ లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జీజీహెచ్ తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీలలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డులను నెలకొల్పి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ సీజనల్ వ్యాధులకు సంబంధించిన రోగుల వివరాలను కూడా రోజువారీగా తెప్పించుకుని, వారికి అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులచే నిశితంగా పర్యవేక్షణ జరిపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య చికిత్సలకు నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల అధునాతన వైద్య పరికరాలు, ఎలిసా టెస్టింగ్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ సెపరేషన్ వంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు హితవు పలికారు. జీజీహెచ్ లో మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.
నిజామాబాద్
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే,
డీఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు.
చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారికి జ్ఞాపికలు బహూకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్.టీ.సీ సంస్థలకు బహుమతులు దక్కాయి. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.








