Connect with us

నిజామాబాద్

సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి

janamvelugunews

Published

on

సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హాస్టళ్ల నిర్వహణ తీరుపై సంక్షేమ అధికారులతో సమీక్ష

నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

జనంవెలుగు, నిజామాబాద్, సెప్టెంబర్ 18:- సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల పనితీరు మెరుగుపడేలా సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. విద్యా వ్యవస్థను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల నిర్వహణ తీరుతెన్నులపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని, గడిచిన మూడు సంవత్సరాల నుండి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన ఉత్తీర్ణత గురించి ఒక్కో హాస్టల్ వారీగా వివరాలు ఆరా తీశారు. ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు హాస్టళ్లను తనిఖీ చేసిన సందర్భంగా గమనించిన లోటుపాట్లను ప్రస్తావిస్తూ, వాటిని చక్కదిద్దుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత సంక్షేమ అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలన్నారు. కేవలం సగటు ఉత్తీర్ణతతోనే సరిపెట్టుకోకుండా, ప్రతి విద్యార్ధి మెరిట్ సాధించేలా చొరవ చూపాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండే చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉండే బ్రాండెడ్ వస్తువులనే వినియోగించాలన్నారు. ప్రతి వసతి గృహంలో సరిపడా తాగునీరు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ లు అందుబాటులో ఉండాలని, టాయిలెట్స్, వాష్ ఏరియా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా మౌలిక సదుపాయాల కొరత నెలకొని ఉంటే, ప్రభుత్వ పరంగా సౌకర్యాల కల్పనకు తాము చొరవ చూపుతామని, విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందేలా సంక్షేమ అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రైవేట్ బడులతో పోలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేసే అధ్యాపకులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు ఎక్కువ ప్రతిభ కలిగి ఉంటారని, తదనుగుణంగా విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో పిల్లలకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యా బోధన, సరైన వసతి సదుపాయాలు అందుబాటులో ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. తనతో పాటు జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఎక్కడైనా నిర్వహణపరంగా లోపాలు వెల్లడైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది సైతం తలెత్తకుండా సమర్ధవంతంగా వసతి గృహాలను నిర్వహించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన సరుకులు, కూరగాయలను వినియోగించాలని హితవు పలికారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యాధికారిని సంప్రదించి చికిత్స చేయించాలని, పై అధికారులకు సమాచారం తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి హాస్టల్ లో ఎల్లవేళలా అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరపాలని, రాత్రి వేళల్లోనూ తప్పనిసరిగా హాస్టల్ లోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, కళాశాలల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా ఎక్కడైనా లోటుపాట్లు జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంస్థల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, సంక్షేమ శాఖల అధికారులు, ఆర్.సీ.ఓలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Thammali Pandu

Published

on

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశం

జనంవెలుగు నిజామాబాద్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, మున్సిపల్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్లతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, పెండింగ్ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడం, కొంతమంది ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్, ప్రతి ఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు అయి ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు అవగాహన సదస్సులలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన NHM ఉద్యోగులు

Thammali Pandu

Published

on

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన NHM ఉద్యోగులు 

సర్వీసుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని NHM ఉద్యోగుల విజ్ఞప్తి  

పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, బోనస్‌లు విడుదల చేయాలని వినతి

ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే

జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని సోమవారం NHM (జాతీయ ఆరోగ్య మిషన్) ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించి, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.గత 14 రోజులుగా డిమాండ్ల పరిష్కారం కొరకు సమ్మె చేపడుతున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా NHM ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలకు తగిన భద్రత, వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..

సర్వీసుల క్రమబద్ధీకరణ: రాష్ట్రవ్యాప్తంగా 78 కేడర్లలో పనిచేస్తున్న 17,541 మంది NHM ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరారు.

సమాన పనికి సమాన వేతనం: రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు సమాన వేతనాలు, పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వుల అమలు: జీవో నంబర్ 60, 1195 ప్రకారం పెరిగిన వేతనాలను తక్షణమే అమలు చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, బోనస్‌ల విడుదల: 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు, 8 శాతం లయబిలిటీ బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు: మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.

ఆరోగ్య భద్రత, బీమా సదుపాయాలు: NHM ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) కింద ఆరోగ్య బీమా, జీవిత బీమా సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ భద్రత: ఉద్యోగులకు తగిన ఉద్యోగ భద్రత కల్పించి, ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి NHM ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను సానుకూలంగా విన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో NHM జిల్లా JAC యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

విజయగాథలకు జాతీయ వేదిక ” మన్ కీ బాత్ “

Thammali Pandu

Published

on

విజయగాథలకు జాతీయ వేదిక ” మన్ కీ బాత్ “

జనంవెలుగు నిజామాబాద్ : – సామాన్యుల విజయ గాథలకు జాతీయవేదికగా “మన్ కీ బాత్” నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

ఆదివారం దేశ ప్రధాని నరేంద్రమోదీ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దేశ ప్రజలకు కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, దేశీయ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం కార్యక్రమ ప్రత్యేకత అని తెలిపారు.

12 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న మన్ కీ బాత్ ప్రజలకు, ప్రధానమంత్రికి మధ్య ఒక ఆత్మీయ వారధిగా నిలిచిందన్నారు.

ఈ ఎపిసోడ్ లో పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్-త్రింజన్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడం విశేషమని పేర్కొన్నారు.

సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు, చేనేత నైపుణ్యాలను భావితరాలకు అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని వివరించారు.

అలాగే ఉత్తరాఖండ్‌లోని హేవల్ నదిని పునరుజ్జీవింపజేయడానికి స్థానిక ప్రజలు, అధికారులు కలిసి చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావించడం పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందన్నారు.

రాబోయే దీపావళి పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపు ప్రతి భారతీయుడు ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

“మన్ కీ బాత్’ కేవలం రేడియో కార్యక్రమం మాత్రమే కాదని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను కోట్లాది మందికి పరిచయం చేసే గొప్ప వేదిక అని కొనియాడారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading