నిర్మల్
ప్యాడి కొనుగోలు సమస్యలపై ఆందోళన, సర్వేను బహిష్కరించిన రైతులు


ధర్మోరా గ్రామంలో రైతులు సర్వేను బహిష్కరించారు, ప్యాడి కొనుగోలు సమస్యలపై ఆందోళన
జనంవెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామంలో ప్యాడి రైతులు ప్యాడి కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమగ్ర కుల గణన సర్వేను బహిష్కరించారు. రైతులు, సర్వే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, తమ ప్యాడి నిల్వలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్యాడి పంట వృధాగా పోతుందని, ధరలు పడిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు. రైతుల వినతులను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని త్వరగా పరిష్కారాలు తీసుకోవాలని స్థానిక రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
నిర్మల్
కనకాపూర్‌లో విద్యుత్ మరమ్మతులు


కనకాపూర్‌లో విద్యుత్ మరమ్మతులు
మాజీ సర్పంచ్ సాలయి నరేష్ ఫిర్యాదుతో స్పందించిన విద్యుత్ అధికారులు
గణేష్, దుర్గామాత ఉత్సవాల సమయంలో విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉందని గతంలో ఫిర్యాదు
జనంవెలుగు, లోకేశ్వరం, అక్టోబర్ 25: మండలం కనకాపూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.గ్రామంలోని విద్యుత్ స్తంభాలు, తీగల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు.గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు,
శ్రీ దుర్గామాత ఉత్సవాల సమయంలో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామ మాజీ సర్పంచ్ సాలయి నరేష్ విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి,గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.మాజీ సర్పంచ్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది తాజాగా గ్రామంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా 9 మీటర్ల విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, విద్యుత్ లైన్లను సరిచేసే పనులు చేపట్టారు.
దీంతో గ్రామంలో విద్యుత్ తీగల వల్ల ఎదురయ్యే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లయింది. విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలుఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సాలయి నరేష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల భద్రత కోసం తాము గతంలో చేసిన ఫిర్యాదుపై స్పందించి మరమ్మతు పనులు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులకు, స్థానిక లైన్మెన్‌కు, విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామంలో విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల భద్రతే లక్ష్యంగా విద్యుత్ శాఖ చేపట్టిన ఈ మరమ్మతు పనులపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్
రహదారులే కల్లాలు!


రహదారులే కల్లాలు!
రైతులకు కల్లాల కొరత.. రోడ్లపైనే ధాన్యం మొక్కజొన్న ఆరబోత!
ప్రమాదాలకు నిలయంగా మారుతున్న ప్రధాన రహదారులు
కనిపించని కల్లాలు.. ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు!
అధికారుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం
జనం వెలుగు, లోకేశ్వరం: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను ఆరబెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు అవసరమైన కల్లాలు, ప్రత్యేక వేదికలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. దీంతో రహదారులు ధాన్యం కల్లాలుగా మారిపోతుండగా, వాహనదారులు, ప్రయాణికులకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
పంట పండించడం ఒక ఎత్తు.. ఆరబెట్టడం మరో ఎత్తు!
రైతులు కష్టపడి పంటలు పండించినప్పటికీ, వాటిని ఆరబెట్టుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ రైతులకు అవసరమైన కల్లాల ఏర్పాటుపై తగిన దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరి కోతలు ప్రారంభం కాగానే గ్రామీణ రహదారులపై ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పలు ప్రధాన రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.
పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అనువైన వేదికలు లేకపోవడంతోనే రోడ్లను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పంటను ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తరలించడంలో జాప్యం జరుగుతుండటంతో ధాన్యాన్ని రోడ్లపైనే కుప్పలుగా పోసి, వాటిపై తాటిపత్రాలు కప్పి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
రహదారులపై మృత్యుపాశం!
రహదారులపై ధాన్యం కుప్పలు ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ధాన్యం కుప్పలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వడానికి ప్రయత్నించే క్రమంలోనూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతుల జీవనాధారమైన పంటలు రహదారులపై ఆరబెట్టడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా పంటల సీజన్‌లో ఇదే సమస్య పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలున్నా.. తరలింపులో జాప్యం!
ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, రవాణా వాహనాలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం తరలింపు నెమ్మదిగా సాగుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ధాన్యాన్ని రోడ్లపైనే నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఒకవైపు కల్లాల కొరత, మరోవైపు ధాన్యం తరలింపులో జాప్యం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సమస్య కారణంగా రహదారులపై ప్రయాణించే ప్రజలు కూడా ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సి వస్తోంది.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!
రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గాలు, సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు, రోడ్లు–భవనాల శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రైతులకు కల్లాలు నిర్మించడంతో పాటు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి పంట ఉత్పత్తులను సకాలంలో తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి!
రైతులకు అవసరమైన కల్లాలు నిర్మించే వరకు రహదారులపై ధాన్యం కుప్పలు ఉన్న ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు కలిగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రివేళల్లో వాహనదారులకు ధాన్యం కుప్పలు స్పష్టంగా కనిపించేలా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అదే సమయంలో, రహదారులపై పంట ఉత్పత్తులను ఆరబెట్టడం వల్ల కలిగే ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నారు.
రైతులకు కల్లాలు.. ప్రజలకు భద్రత కల్పించాలి!
రైతులు పండించిన పంటను భద్రపరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం కూడా అత్యంత కీలకం. అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి, గ్రామాల్లో అవసరమైన కల్లాలను నిర్మించడంతో పాటు ధాన్యం కొనుగోలు, రవాణా సమస్యలను పరిష్కరించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. రైతుల కష్టానికి పరిష్కారం చూపాలి.. రహదారులపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి..ప్రజల ప్రాణాలను కాపాడాలి
నిర్మల్
కనకాపూర్ లో స్మార్ట్ రేషన్ కార్డులు,చెత్త బుట్టల పంపిణీ


కనకాపూర్ లో స్మార్ట్ రేషన్ కార్డులు,చెత్త బుట్టల పంపిణీ
జనంవెలుగు, లోకేశ్వరం:- మండలంలోని కనకాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు, చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షిండే సునీల్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రతను కాపాడుకోవడంతో పాటు, ప్రతి కుటుంబం చెత్తను చెత్త బుట్టల్లోనే వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగుబాయి గంగన్న, పంచాయతీ కార్యదర్శి రాజు, రేషన్ డీలర్ దేబ్బడి దేవేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.








