నిజామాబాద్
బీసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు : రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ


బీసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు : రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ
జనంవెలుగు, రుద్రూర్ :– బీసీ రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ విమర్శించారు. శనివారం జరగనున్న బీసీ బంద్‌కు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను మోసం చేసే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గట్టిగా ప్రశ్నించి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా బీసీల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్రంలో 28 మంది బీసీ మంత్రులను నియమించిన ఏకైక పార్టీ బీజేపీనేనని హరికృష్ణ తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమ క్యాబినెట్‌లో ఎన్ని బీసీ మంత్రులకు పదవులు ఇచ్చిందో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు, మంత్రులు బీజేపీ పార్టీ ద్వారానే అవకాశాలు పొందారని ఆయన గుర్తు చేశారు. బీజేపీపై బురదజల్లే రాజకీయాలను మానుకుని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేపటి బీసీ బంద్ విజయవంతం కావడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తారని ఆలపాటి హరికృష్ణ మీడియా ద్వారా వెల్లడించారు.
నిజామాబాద్
Nizamabad | ఆర్‌టీసి ప్రయాణికుల అదృష్టం మెరిసింది


ఆర్‌టీసి లక్కీ డ్రా విజేతలకు బహుమతి చెక్కుల ప్రదానం
ఆర్‌టీసి లక్కీ డ్రా విజేతలకు చెక్కుల పంపిణీ
జనంవెలుగు, నిజామాబాద్: ఆర్‌టీసి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులు తమ టికెట్లను ప్రధాన బస్‌స్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్‌లో వేయగా, ఈ నెల 8న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా విజేతలను ఎంపిక చేశారు. ప్రతి జిల్లాలో ముగ్గురు విజేతలను ఎంపిక చేసినట్లు ఆర్‌ఎం జ్యోత్స్న తెలిపారు. శుక్రవారం రోజు ఆర్‌టీసి ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు చెక్కులను అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రథమ బహుమతి రూ.25,000 ను చంద్రయ్య, ద్వితీయ బహుమతి రూ.15,000 ను షేక్ బాబర్, తృతీయ బహుమతి రూ.10,000 ను రామ్ ప్రసాద్ గెలుచుకున్నారు.
రంగారెడ్డి రీజియన్‌లో సమియా తబస్సుమ్ మొదటి బహుమతి, అజార్ రెండవ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం జ్యోత్స్న మాట్లాడుతూ ఆర్‌టీసి సేవలను ఆదరిస్తున్న ప్రయాణికులకు హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆదరణ కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఆర్‌టీసి రీజియన్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ ఆర్‌ఎం మధుసూదన్ రావు, డిపో-1 మేనేజర్ ఆనంద్, పర్సనల్ ఆఫీసర్ పద్మజతో పాటు ఆర్‌టీసి సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నిజామాబాద్
జిల్లా వాలీబాల్ జట్టుకు ముప్కాల్ విద్యార్థి నయన్ ఎంపిక


జిల్లా వాలీబాల్ జట్టుకు ముప్కాల్ విద్యార్థి నయన్ ఎంపిక
జనంవెలుగు, ముప్కాల్ :– నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్-17 ఎస్జీఎఫ్ (School Games Federation) వాలీబాల్ విభాగంలో ముప్కాల్ మండలం రెంజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సుంకరి నయన్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో నయన్ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. రవి కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, సహ విద్యార్థులు నయన్‌ను అభినందించారు. విద్యార్థి ప్రతిభను చూసి అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర స్థాయిలోనూ మంచి ఫలితాలు సాధించి పాఠశాల పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని వారు ఆకాంక్షించారు.
Crime
అక్బర్ నగర్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి


అక్బర్ నగర్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి
జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం అక్బర్ నగర్ గ్రామంలోని గుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయన్న తెలిపిన వివరాల ప్రకారం, అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రతిరోజూ పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో రుద్రూర్ పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సాయన్న మాట్లాడుతూ, పేకాట నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.