నిజామాబాద్
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు


రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
బైక్ ర్యాలీ, మానవహారం
మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీ.పీ, జిల్లా అధికారులు
జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 15 : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ నగర పర్యటనకు బుధవారం విచ్చేసిన రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.
హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిజామాబాద్ చేరుకున్న మంత్రిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, ఇతర జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
అక్కడి నుండి పోలీసు బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా మంత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకోగా, అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా అధికారులతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తద్వారా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు.
ఎన్ని చట్టాలు నిబంధనలు అమలు చేసినా, ప్రజలలో మార్పు రానంత వరకు ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అన్నారు. దీనిని గుర్తిస్తూ పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అరైవ్ అలైవ్ పేరుతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించాలని, అలా కృషి చేసిన వారిని రహ్ వీర్ కింద రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.
నిజామాబాద్
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే,
డీఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు.
చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారికి జ్ఞాపికలు బహూకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్.టీ.సీ సంస్థలకు బహుమతులు దక్కాయి. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.








