నిజామాబాద్
రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి


రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే పెరుగుతున్న ప్రమాదాలు
రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
జనంవెలుగు, నిజామాబాద్, ఏప్రిల్ 15: నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం నిజామాబాద్ శివారులోని సుగుణ గార్డెన్స్ లో పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎం.డీ నాగిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని, ఎవరికివారు తమవంతు బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని, తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ చలానాలు విధించినా, ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి కఠిన చర్యలు చేపట్టినా కూడా, ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రానంతవరకు రోడ్డు ప్రమాదాల పరిస్థితిలో మార్పు రాదని అభిప్రాయపడ్డారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ లో భాగంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని గుర్తు చేశారు.
ఇదిలాఉండగా, నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రతిరోజూ 10వేల బస్సులు సుమారు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ పరంగా కూడా చెక్ పోస్టులు ఎత్తివేయడం వంటి అనేక నూతన సంస్కరణలను అమల్లోకి తెచ్చామని గుర్తు చేశారు.
రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలలో మన దేశంలో ప్రతి ఏటా లక్షా 50 వేల మంది, రాష్ట్రంలో 7వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వీటిలో సుమారు 45శాతం వరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటించి ప్రమాదాలకు నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్యలు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటోలలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోందని అన్నారు. అతివేగాన్ని మానుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎంతో అప్రమత్తతో వాహనాలు నడపాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బాధితులు వెల్లడిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. అతి వేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపి తమ లాంటి దుస్థితిని కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేయడం అందరినీ ఆలోచింపజేసింది. రహ్ వీర్, పీ.ఎం రాహత్, హిట్ అండ్ రన్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటు, ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన గోడ ప్రతులను, కర పత్రాలను మంత్రి ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, డాక్టర్ కవితా రెడ్డి, డీటీసీ దుర్గా ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.
నిజామాబాద్
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే,
డీఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు.
చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారికి జ్ఞాపికలు బహూకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్.టీ.సీ సంస్థలకు బహుమతులు దక్కాయి. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.








