మెదక్
చిట్కుల్‌లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం


చిట్కుల్‌లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం
ప్రతి గురువారం సంత నిర్వహణ.. తక్కువ ధరలకు నాణ్యమైన మేకలు, గొర్రెలు
జనంవెలుగు, చిలిపిచేడ్:- చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గురువారం మేకలు, గొర్రెల సంతను గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గురువారం మేకలు, గొర్రెలను విక్రయించుకునేలా సంతను ఏర్పాటు చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు.
ఈ సంత ద్వారా చిట్కుల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు తమ పశువులను నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే కొనుగోలుదారులకు నాణ్యమైన మేకలు, గొర్రెలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి గురువారం సంత నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు మంచి మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
మెదక్
చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ


చిలిపిచేడ్ MPDOగా బానోత్ ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ
జనం వెలుగు చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (MPDO) బానోత్ ప్రవీణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు MPDOగా విధులు నిర్వహించిన ప్రశాంత్ స్థానంలో ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతల బదిలీ అనంతరం మాజీ MPDO ప్రశాంత్ కొల్చారం మండల పంచాయతీ అధికారిగా (MPO) నియమితులయ్యారు. అనంతరం కొల్చారం మండల పంచాయతీ కార్యాలయంలో MPOగా బాధ్యతలు స్వీకరించారు.
చిలిపిచేడ్ మండలానికి నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన బానోత్ ప్రవీణ్‌కు మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
మెదక్
చిట్కుల్‌లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం


చిట్కుల్‌లో వినాయక మండపాలకు రూ.80 వేల విరాళం
జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి చిట్కుల్ గ్రామంలోని వినాయక మండపాలకు ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సుమారు 8 వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులకు మొత్తం రూ.80 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తారా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్ ఎండీ అఖిల్, మాజీ సర్పంచ్ భూమయ్య, ముక్క అశోక్, బాగయ్య, ప్రవీణ్, కొమురయ్యతో పాటు పలువురు యువకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మెదక్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ


ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, యువ నాయకులు వీరారెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందుతో పాటు రంజాన్ తోఫాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో నిండివుంటాయని తెలిపారు. అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కఠిన నియమాలతో ఉపవాసం పాటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విరయ్య, కిష్టయ్య, అబ్దుల్ రషీద్, షకీల్, యదుల్లా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.








