నిజామాబాద్
తెలంగాణాను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే ధ్యేయం


తెలంగాణాను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే ధ్యేయం
ఆదరిస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం
నిజామాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
విధి నిర్వహణలో అమరులైన కానిస్టేబుళ్లు సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కుల అందజేత
డ్వాక్రా సంఘాలకు రూ. 200 కోట్ల రుణాలు పంపిణీ
రూ. 700 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నిజామాబాద్ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సీ.ఎం
జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 06: అన్ని కులాలు, అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యతనిస్తూ, తెలంగాణాను అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తే మరింతగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని అన్నారు. అధికారం చేపట్టిన రెండేళ్ళ కాలంలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కొలువుల జాతరను కొనసాగించామని గుర్తు చేశారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి ముఖ్యమంత్రి సాయంత్రం 4.00 గంటల సమయానికి బర్దీపూర్ చేరుకోగా, హెలిప్యాడ్ వద్ద ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, ఇతర ప్రజాప్రతినిధులు సీ.ఎంకు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ యూనివర్సిటీలో రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో వేర్వేరుగా నిర్మించనున్న ఎస్సీ బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులకు సీ.ఎం శంకుస్థాపన చేశారు.
అలాగే, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్‌వాయి లో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులకు, రూ.600 కోట్లతో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు, తెలంగాణ యూనివర్సిటీలో రూ. 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి, రూ.43 కోట్లతో ఆడిటోరియం, పరిపాలనా భవనం (అడ్మిన్ బిల్డింగ్), సీఎస్‌ఈ భవనం విస్తరణకు సంబంధించిన పనులకు, రూ. 21 కోట్లతో రోడ్ల నిర్మాణం, విస్తరణ తదితర పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో రూ. 18 కోట్లను వెచ్చిస్తూ నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ కు ప్రారంభోత్సవం చేశారు.
1614 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ. 200 కోట్ల విలువ చేసే చెక్కును పంపిణీ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య, సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను సీ.ఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నిజామాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని అన్నారు. నిజామాబాద్ గడ్డ మీద నుండే ప్రజాకవి దాశరథి నా తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించారని గుర్తు చేశారు. ఇదే జిల్లా నుండి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు వంటి నిజాయితి కలిగిన మచ్చ లేని నాయకులు ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో 10 సంవత్సరాలు, కేంద్రంలో 12 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగిన గత పాలకులు నిజామాబాద్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని సీ.ఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అందుకే 1931 సంవత్సరంలోనే నిజామాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ, స్మార్ట్ సిటీగా గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయమై స్థానిక పార్లమెంటు సభ్యుడు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి బాట పట్టిస్తామని సీ.ఎం స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ జిల్లాకు చెందిన దివంగత నేత డి.శ్రీనివాస్ పీ.సీ.సీ అధ్యక్షుడిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఉంటూ తమ పార్టీని రెండు పర్యాయాలు వరుసగా అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ సారథ్యం, తన నాయకత్వంలో రానున్న 2029 ఎన్నికల్లోనూ ప్రజా ప్రభుత్వమే వరుసగా అధికారంకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పోరేషన్ సహా, ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. గత రెండేళ్ళ కాలంలోనే ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పట్టణాల అభివృద్ధి కోసం రూ.1045 కోట్ల నిధులను కేటాయించామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, మున్సిపల్ పట్టణాలకు 17,400 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని సీ.ఎం వెల్లడించారు.
అయితే తమ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో మెజారిటీ బల్దియాలలో మేయర్లు, చైర్మన్లుగా కొనసాగిన ప్రతిపక్ష పార్టీల వారు ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టకుండా ప్రగతిని అడ్డుకున్నారని ఆక్షేపించారు. ఇప్పుడు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని, మున్సిపల్ ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఆదరిస్తే పట్టణాలు, నగరాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు నూటికి నూరు శాతం ప్రభుత్వం కంకణబద్ధమై కృషి చేస్తుందని సీ.ఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. నిజామాబాద్ జిల్లాకు ఎయిర్ పోర్ట్ తెస్తామని, ప్రాణహిత-చేవెళ్ళ 21(ఎ) ప్యాకేజీ పనులను పూర్తి చేయించి 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు రూ. 9వేల కోట్లు చెల్లించిందని, మహిళా సంఘాలకు వెయ్యి అద్దె బస్సులు అందించామని గుర్తు చేశారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఉచిత విద్యుత్, రాయితీపై రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 3.17 కోట్ల మందికి ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు 500 చొప్పున బోనస్ తదితర వాటిని అమలు చేస్తున్నామని అన్నారు. ఇదివరకు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే రైతులు పంటలు పండిస్తూ ఆత్మగౌరవంతో జీవనాలు వెళ్లదీస్తున్నారని అన్నారు.
తనపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని లేనిపోని విమర్శలు చేసినా పట్టించుకోనని, అన్ని కులాలు, మతాలను సమన్వయము చేస్తూ తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే ప్రధాన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. బహిరంగ సభలో వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు తాహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అర్కల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
——————————–
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.
నిజామాబాద్
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూన్ 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగ రావు, డీఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే,
డీఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు.
చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, వారికి జ్ఞాపికలు బహూకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్.టీ.సీ సంస్థలకు బహుమతులు దక్కాయి. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.




















