Connect with us

నిజామాబాద్

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

janamvelugunews

Published

on

Views: 12205

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

 పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్, సీ.పీ పిలుపు

 ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి

జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 10: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరాలను వెల్లడించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి 3,48,116 మంది ఓటర్లు ఉండగా, 488 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డుల పరిధిలో 69,439 మంది ఓటర్లు ఉండగా 111 పోలింగ్ కేంద్రాలను, ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో 36 వార్డులలో 63,977 ఓటర్లకు గాను 106 పోలింగ్ కేంద్రాలను, భీంగల్ మున్సిపాలిటి పరిధిలో 12 వార్డులలో 14,046 మంది ఓటర్లు ఉండగా, 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.

      ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి చెక్ లిస్టు ప్రకారం అందిస్తూ, వారు సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి విజయ మేరీ హైస్కూల్ లో, ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించి భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులకు తిరిగి ఇవే కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి, ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపడతామని అన్నారు. నాలుగు మున్సిపాలిటీలలో కలుపుకుని మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, బోధన్ లో 162 మంది, ఆర్మూర్ లో 153 మంది, భీంగల్ లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించి, పోలైన ఓట్లను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాఫీగా ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా జిల్లాలో మొత్తం 4375 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని అన్నారు. వీరిలో 66మంది ఆర్.ఓలు, 66 మంది ఏ.ఆర్.ఓలు, 877 మంది పీ.ఓలు, 877మంది ఏ.పీ.ఓలు, 2625 మంది ఓ.పీ.ఓలు ఉన్నారని వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయించామని, ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా 73 మంది మైక్రో అబ్జర్వర్లను, 47మంది జోనల్ అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు.

       కాగా, అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు బీ.ఎల్.ఓల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఓటరు సమాచార స్లిప్పులను అందజేయడం జరిగిందని, ఇప్పటికే 88 శాతం పంపిణీ పూర్తయ్యిందని, మిగతా వాటిని మంగళవారం సాయంత్రం వరకు పంపిణీ పూర్తి చేయిస్తామని అన్నారు. 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని చూపి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. అయితే, పోలింగ్ కేంద్రాలలోకి సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ద్రవ పదార్థాలను పూర్తిగా నిషేధించడం జరిగిందని, ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తమ వెంట పోలింగ్ బూత్ లోనికి తీసుకెళ్లకూడదని అన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి అనుమతించేలా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామని తెలిపారు. 11న సాయంత్రం 5.00 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపలికి చేరుకున్న ఓటర్లకు క్యూ పద్దతిని అనుసరిస్తూ టోకెన్లు జారీ చేసి ఓటింగ్ కు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని, 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం ఉదయం 11.00 గంటలకు సంబంధిత మున్సిపాలిటీలలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నిజామాబాద్ నగర పాలక సంస్థలో జరిగే సమావేశానికి నిజామాబాద్ ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని, బోధన్, ఆర్మూర్ లలో సబ్ కలెక్టర్లు, భీంగల్ లో జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని అన్నారు.

       పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏడుగురు ఏ.సీ.పీలు, 70 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మరో 70 మంది సబ్ ఇన్స్పెక్టర్లు సహా 1370 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని, ప్రత్యేకంగా మూడు ప్లాటూన్ల పోలీసు బలగాలు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా తక్షణమే స్పందించేందుకు వీలుగా స్త్రైకింగ్ ఫోర్సు, క్విక్ రియాక్షన్ టీం బృందాలు ఏర్పాటు చేశామని, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలు గట్టి నిఘా కొనసాగిస్తున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలను ఉపేక్షించబోమని సీ.పీ స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్నికలకు ఏ దశలోనైనా సరే ఆటంకాలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, పోలీస్ కమాండ్ కంట్రోల్ నుండి కూడా నిశిత పర్యవేక్షణ చేస్తామని అన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే పోస్టింగ్ లు, వీడియోలను కూడా పరిశీలిస్తూ, రెచ్చగొట్టే రీతిలో, ఘర్షణలకు తావు కల్పించేలా నిబంధనలకు విరుద్ధంగా ఉండే సోషల్ మీడియా పోస్టులు చేసే వారి పైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే పాత నేరస్తులను బైండోవర్ చేశామని, 67 లైసెన్సుడు తుపాకులను డిపాజిట్ చేశారని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. విలేకరుల సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.

నిజామాబాద్

సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం

janamvelugunews

Published

on

Views: 4

సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ…. విద్యార్థుల చదువుకు సంబంధించిన పురోగతి, అలాగే సమస్యలు తదితర విషయాలపై చర్చించడం జరిగిందని, తమ పిల్లలు చదువుకునే చదువు గురించి తెలుసుకొనేందుకు కళాశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని, ఇలాగే తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థులపై పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ ఓ డి లు లావణ్య, కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

| nandipet యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు

janamvelugunews

Published

on

Views: 224

యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు

నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు శుక్రవారం యూరియా దొరుకుత లేదంటూ… యూరియా యాప్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు చూడాలని రోడ్డెక్కారు. లక్కంపళ్లి, చిమ్రాజ్పల్లి, నందిపేట రైతులు చేపట్టిన ఈ ధర్నాతో వివేకానంద చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.

స్థానిక ఎస్సై శ్యామ్రాజ్, ఎస్సై 2 రాము లు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు తెల్వెద అబ్బి గంగారం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ విధానం సరైన రీతిలో చేయట్లేదని, రైతుకు యూరియా కావాల్సి వస్తే యాప్ లో బుకింగ్ చేసుకున్న వాళ్లకే యూరియా సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే సొసైటీలో యూరియా మాయమైపోతుందని, అసలు నిజమైన లబ్ధిదారులకు యూరియా బస్తాలు అందడం లేదని, ఈ సమయంలో రైతు పొలానికి యూరియా వేయనట్లయితే వరి రైతు తీవ్రంగా నష్టపోతారని, యూరియా దొరకకపోతే రైతుకు ఉరే గతి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆప్ విధానంపై అవగాహన కల్పించ కుండా… సరఫరా చేయడం సరైనది కాదని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడం ఏంటని, చదువుకోని వారికి యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని, ఆప్ విధానం కాకుండా ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరారు.

Continue Reading

నిజామాబాద్

|nandipet ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

janamvelugunews

Published

on

Views: 90

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హన్మండ్లు మాట్లాడుతూ అఖండ భారతావనిలో హిందూ ధర్మాన్ని కాపాడిన ఏకైక మహావీరుడు శివాజీ అని, ఆయన ధైర్య సాహసాలను ఎంత పొగిడిన తక్కువేనని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే మొగలుల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ధర్మరక్షణకై యుద్ధ రంగంలో కదం తొక్కిన మహావీరుడని, ఎన్నో విజయాలు సాధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధైర్యశాలి ఆశంబుజీ మహారాజ్ అని కొనియాడారు. నేటి యువత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఉప సర్పంచ్ నీరడి రాములు, దత్తపురం భోజన్న, ఆమందు వంశీ, దినేష్ గౌడ్, పుల్ల మహేష్, ఉద్గిరి అరవింద్, పిట్ల మోహన్, గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading